దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్, మనీ లాండరింగ్ కేసులు ఉన్న రాజకీయ నాయకులపై కేసులు తిరిగి విచారించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా తెలంగాణా హైకోర్టు ఇప్పటికే కేసుల విచారణ మొదలుపెట్టేసింది.
కేసుల విచారణ నిమిత్తం కరోనా నిభందనలను సైతం సడలించింది హైకోర్టు. తెలంగాణా హైకోర్టులో ఏపీ సీఎం జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సీబీఐ నమోదు చేసిన 11కేసులు ఈడీ నమోదు చేసిన 5 కేసులు సీబీఐ కోర్టుకు విచారణకు రాగా వీటిని జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.
అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉందంటూ ప్రస్తుత ఉన్న వ్యాజ్యాలను దసరా ముగిసిన తరువాత ఆన్లైన్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కోరారు.
అంతే కాక ఎమ్మెల్యేలు, ఎంపీ ల కేసులను ఇప్పటికిప్పుడే విచారణ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా లేదంటూ వ్యాఖ్యానించడంతో జగన్ తరపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
అంతేకాకుండా అసలు సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వకపోతే హైకోర్టు మార్గదర్శకాలు ఎందుకు విడుదల చేస్తుందని వ్యాఖ్యానించారు. న్యాయవాది ఇలాంటి సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ కోర్టుకు తెలిపారు. దీనితో ఆన్ లైన్ విచారణ ను కూడా పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
అంతేకాక ఆన్లైన్ విచారణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ భౌతిక విచారణ తప్పనిసరిగా హాజరవ్వాలన్నారు. దీనికి గాను న్యాయవాదుల ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ ఇవ్వాలని సూచించారు. అయితే నిందితులకు మాత్రం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునిచ్చింది.