అమెరికా నిరసనలతో చెలరేగిపోతోంది. వైట్ హౌస్ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కడి నిరసనకారులను చూసి ట్రంప్ టీం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్బంధాన్ని దాటుకొని లోపలికి వచ్చి ట్రంప్ భవనం వద్ద భీభత్సాన్ని సృష్టించారు నిరసనకారులు. ఇలా జరగటం బహుశా ఇదే మొదటి సారి. ఈ భీభత్సం లో కొంతమంది పోలీసులు వైట్ హౌస్ తూర్పు వైపున కాల్పులు జరిపినట్టు ఆ కాల్పులలో కొందరు నిరసనకారులు తీవ్రంగా గాయ పడినట్టు వార్తలు వస్తున్నాయి.
వైట్ హౌస్ వద్ద పరిస్థిని దృష్టిలో పెట్టుకొని సిఐఎ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అమెరికాలోని 40కి పైగా ప్రధాన నగరాల్లో నిరసనజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కర్ఫ్యూ విధించినా లెక్కచేయకుండా నిరసనకారులు వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బారికేడ్లను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. పలు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి వైట్ హౌస్ ప్రాంతంలో ఉన్న అమెరికా జాతీయ జెండాను తీసి మంటల్లో వేశాడు. ఇంకొందరు ఆందోళనకారులు అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి ఆ మంటల్లో పడేశారు. వైట్ హౌస్ సమీపంలో ఉన్న బాత్‌రూమ్‌లకు, కొన్ని కార్యాలయాలకు నిప్పంటించారు. కొంత మంది వైట్ హౌస్‌పైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు.
పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అండర్గ్రౌండ్ బంకర్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆయన్ని అక్కడే ఉంచినట్లు సమాచారం.అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లడం అమెరికా చరిత్రలో చాలా అరుదు. అత్యవసర సమయాలు, ఉగ్రదాడులు జరిగేటటువంటి పరిస్థితుల్లోనే ఈ బంకర్ ఉపయోగిస్తారు. ఏకంగా అధ్యక్షుడే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి రావడం చూస్తూనే అక్కడ నిరసనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా ఆఫ్రికన్ – అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పోలీసులు ఆయన్ని అమానుషంగా కాల్చి చంపారనేది ప్రధాన ఆరోపణ. నిరసనలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులతో పాటు పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల ప్రవర్తనపై నిరసనకారులు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణతో విల విల లాడుతున్న అమెరికాకు ఈ నిరసనలు కొత్త తలనొప్పిగా మారింది.